Saturday, October 27, 2007

'నేము'లో నేముంది?

అసలు ఈ పెద్దవాళ్ళను చూస్తుంటే నాకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంటుంది. పాపం చిన్నపిల్లలం కదా కష్టమైన మాటలు పలకడం కష్టం కదా అని కొంచెం కూడా ఆలోచించరు. ఇంటికి ఎవరొచ్చినా నీ పేరేంటమ్మా అని అడుగుతారు. రమణ అని చెప్తాను. అక్కడితో ఆగచ్చు కదా! పూర్తి పేరేంటని అడుగుతారు. ఎంటిక రమణ అంటాను, మరి అప్పట్లో నాకు నోరు తిరిగేది కాదుగా. ఇంక అప్పట్నించి స్టార్టు నా కష్టాలు. అందరూ ఎంటిక రమణ అని ఎక్కిరించడం. ఇలా కాదని ఓ గొప్ప అయిడియా ఆలోచించేసాను. పూర్తి పేరడిగినప్పుడు ఇంకేం లేదు... ఉత్త రమణ అని చెప్పేవాణ్ణి. అప్పట్నించి "ఉత్త రమణ" అని ఎక్కిరించడం స్టార్ట్ చేసారు. ఏం చేస్తాం? నా రాత!

నాకే కాదు మా తమ్ముడికీ, అన్నగాడికి కూడా తప్పలేదు ఈ కష్టాలు. మా అన్నగాడి పేరు శివరామ శర్మ. ఫ్రెండ్సందరూ శర్మ శర్మ అని పిలుస్తుంటే తెగ స్టైలు కొట్టేవాడు. అలాంటిది ఒకసారి రోడ్డు మీద ఫ్రెండ్సుతో కలిసి వెళ్తుంటే మా పెద్దనాన్న కనబడి శివరాముడూ అని పిలిచార్ట. వాడు ఇంటికొచ్చి ఒకటే గోల. మా తమ్ముడిక్కూడా తప్పలేదు ఇలాంటి ఇన్సల్ట్సు. వాడి అసలు పేరు చంద్ర శేఖర్ అయినా, మేమంతా వాణ్ణి చిన్ని పిలుచుకునేవాళ్ళం. వాడేమో అది వాళ్ళ ఫ్రెండ్సుకు తెలియనీకుండా జాగ్రత్తగా మేంటైన్ చేసుకుంటూ వచ్చాడు. నేను కూడా వాడి పరువు కాపాడాలని స్కూల్లో ఒరేయ్ అనేవాణ్ణి తప్ప ఎప్పుడూ చిన్ని అని పిలవలేదు. మా రమాకాంతన్న (మా పెద్దన్న) అప్పట్లో బి.ఇ.డి చేసేవాడు. మా చిన్నిగాడి ఖర్మ కొద్దీ ఓ రోజు మా అన్న వాళ్ళకు ఇంగ్లీషు క్లాసు తీసుకున్నాడు. క్లాసులో మా తమ్ముణ్ణి లేపి "Mr. Chinni, answer this question" అన్నాట్ట. ఇంకేముంది క్లాసు మొత్తానికీ తెలిసిపోయింది. ఎదురింట్లో ఉండే చిదంబరం తాతయ్య మా తమ్ముణ్ణి చంద్ర శేఖరం అని పిలిచేవాడు, ఖరం అన్నమాటను ఒత్తి పలుకుతూ. ఖరం అంటే గాడిద అంట. అది విన్నప్పుడు నాకే ఒళ్ళు మండిపోయేది. ఇక మా తమ్ముడికెలా ఉండేదో!

2 comments:

Ravi Kanth said...

aavakaya.... perugannam....bapu bomma...nee telugu....inkem cheppalenu....

జాలయ్య said...

మీ పేర్ల కథా-కమామీషు బాగుంది

బ్లాగులోకానికి స్వాగతం.
మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.
jalleda.com
జల్లెడ