Monday, November 12, 2007

విబూది పండ్లు

నా చిన్నప్పుడు జరిగిన సంఘటన. మరీ చిన్నవాణ్ణేం కాదు. చిన్నవాళ్ళలో పెద్దవాణ్ణి (కానీ మా అన్న కంటే చిన్నవాణ్ణే లేండి. అదేంటో నేనెంత పెద్దవుతున్నా మా అన్నగాడి కంటే పెద్దవాణ్ణి మాత్రం అవలేకపోతున్నాను). మా తాతయ్యవాళ్ళు ఎదురింట్లో దిగారు. తాతయ్య అంటే సొంతం తాతయ్య కాదులెండి. మా తాతయ్యకు ఎక్కడో తమ్ముడి వరస. ఆ అమ్మమ్మకు, మా అమ్మకు మంచి దోస్తీ కుదిరింది. మా అమ్మకు కబుర్లు చెప్పడానికి ఓ మనిషి కావాలి అంతే, ఎవరైతే ఏంటి? గంటలకొద్దీ నడిచేవా మీటింగ్స్. నేనెళ్ళి నాన్నొచ్చారనో, ఆకలేస్తుందనో గోలచేస్తేగానీ వాళ్ళు ఈ లోకంలోకి వచ్చేవారు కాదు. అసలు వీళ్ళు రోజూ ఏం మాట్లాడుకుంటారో విందామని నేనూ ఓ రోజెళ్ళి మా అమ్మ ఒళ్ళో సెటిలైపోయాను. ఆ రోజు వాళ్ళ టాపిక్ బ్రాహ్మల కట్టుబాట్లూ, ఆచారాలూ. మా అమ్మమ్మ అనర్గళంగా ఉపన్యసించడం మొదలెట్టింది. అసలు బ్రాహ్మణులంటే ఎలా ఉండాలి అంటూ ఆటోబయోగ్రఫీలోకి వెళ్ళిపోయి వాళ్ళ నియమనిష్ఠలన్నీ ఏకరువు పెట్టింది. ఆ రెండు గంటల సమావేశ సారాంశం ఏమిటంటే మా అమ్మమ్మ వాళ్ళది నిప్పుల్ని కడిగే వంశం. అలాంటివాళ్ళు మా ఎదురింట్లో ఉండటం మా పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఆచారాల మాటెలా ఉన్నా, పెద్ద కలర్ టీవీ ఉండి, డిష్ (అంటే కేబుల్) కనెక్షన్ ఉన్నవాళ్ళు ఎదురింట్లో ఉండటం నిజంగా అదృష్టమే కదా! ఎప్పట్లాగే ఓ ఆదివారం మధ్యాన్నం వాళ్ళింట్లో కూర్చొని సినిమా చూస్తున్నాను. అందరూ టీవీలో లీనమై ఉన్నారు. ఇంతలో వాళ్ళ మనవరాలు వంటింట్లోనుంచి గెంతుతూ వచ్చింది "దొలికింది దొలికింది" అంటూ. ఆ పిల్ల చేతిలో ఓ కవరు, దానిలో తెల్లగా మెరుస్తూ రెండు కోడిగుడ్లు. మా అమ్మమ్మ వెంటనే అలర్టు అయిపోయింది. గబుక్కున ఆ కవరు లాక్కుని "విబూది పళ్ళను ఎప్పుడుపడితే అప్పుడు తియ్యకూడదు. కిందపడితే పాపం" అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది. నాకు నవ్వాగలేదు. ఇంట్లో చెప్తే అందరూ పడీ పడీ నవ్వడం, ఆచారాలంటే కోడిగుడ్లను విబూదిపండ్లనడమా అని! ఏమైతేనేం, మా నానార్థాల జాబితాలోకి ఇంకో పదం చేరిపోయింది.

3 comments:

Anonymous said...

దాదాపుగా ఇలాంటిదే నాకూ ఒక అనుభవం వుంది.కాని మా ఆవిడ మాత్రం చాలా సేపు నవ్వింది విభూతి పండంటే

రాజేంద్ర


http://visakhateeraana.blogspot.com/

Ravi Kanth said...

too much undi ramana..nee teepi gurutulu.. maakandariki paayasam panchi pedutunnayi...

expecting many more from you..

aa spelling mistakes Google Indic transliterate lo copy chesi paste cheyyadam vala vachhinavi.. eesari sarididduta..[:)]..

Ravi Kanth said...

hehhe..ikkada matter entante...
nenu running..bussu kaadu..so adi running bus jaabitha loki raadu..[:P]..